మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న అనుమానం..మారిన వ్యవహారం
‘తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు ఆరోజు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. కాలికి గాయాలై నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇబ్బందిపెట్టకుండా సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు దర్యాప్తు బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్ సిగ్నళ్ల ద్వారా బృందంలోని ఓ సీఐ తెలుసుకున్నారు. అప్పటికే అదుపులో ఉన్న అతన్ని మరోసారి సీఐ ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. ఆటో నడపటం పూర్తయ్యాక సినిమాకు వెళ్లి తర్వాత మద్యంతాగి ఇంటికెళ్లినట్టు వివరించాడు. అతను చెప్పిన వివరాలన్నీ నిజమేనని నిర్ధారణకు వచ్చాక దర్యాప్తు అధికారులు రివర్స్ ఇన్వెస్టిగేషన్‌ను ప్రయోగించారు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్‌స్టాప్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. సాయంత్రం 6-7.30 గంటల మధ్యకాలంలో హెరిటేజ్ బస్‌స్టాప్, యంనంపేట గ్రామం, శ్రీనిధి కళాశాల, ఘట్‌కేసర్ ప్రధాన రహదారి, ఎన్‌టీపీసీ క్రాస్‌రోడ్స్ అన్నోజిగూడ గ్రామాల్లో ఆమె ఒంటరిగానే నడుచుకుంటూ వెళ్లినట్టు గుర్తించారు.
పోలీసులు నిలదీయడంతో..
అపహరణ, అత్యాచారం అబద్ధమని నిరూపించేందుకు కావాల్సిన స్పష్టమైన ఫుటేజీలు, ఇతర సాక్ష్యాధారాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి సేకరించారు. వాటితో లఘుచిత్రాన్ని తయారుచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లారు. ‘‘ఇవీ నిజాలు. ఇప్పుడు చెప్పండి. మీపై ఎవరు అత్యాచారం చేశారు’’ అని డీసీపీ ప్రశ్నించారు. తర్వాత చెబుతానని యువతి అనడంతో వెనక్కు వచ్చేశారు. ‘మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన యువతి, తాను చెప్పిందంతా అబద్ధమని అంగీకరించిందని’ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వాస్తవాలను తెలుసుకునేందుకు మూడు రోజులు పట్టిందన్నారు. ఈ వ్యవహారంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంబంధంలేదన్న సీపీ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ఆటోడ్రైవర్లను కోరారు.