కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇవ్వడంతోనే అవమానంగా భావించి తన కుమారుడు గడ్డిమందు తాగాడని బాధితుడి తండ్రి వాపోయాడు.
జిల్లాలోని లింగంపేట మండలం నల్లమడుగు తండాకు చెందిన ధనావత్ రాము... కామారెడ్డిలోని గిరిజన వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. పాఠశాలకు వెళ్లలేదు. గత నెల 26న రాము స్కూల్‌కు వెళ్లగా ఇన్నిరోజుల నుంచి ఎందుకు రాలేదని ప్రిన్సిపల్ దీప్లా నిలదీశారు.
బంధువు చనిపోయి పరిస్థితులు బాగాలేక రాలేకపోయానని చెప్పాడంతో.. ఇంటివద్దనే ఉండి చదువుకో అని చెప్పి టీసీ ఇచ్చి పంపించారు. ఈ చర్యను అవమానంగా భావించిన రాము గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం