STUDENT STUCK BETWEEN TRAIN UPDATE : ఎన్నో నోములు, పూజల ఫలం.. పెళ్లయిన ఆరేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క సంతానం.. ప్రమాదంలో ప్రాణం కోల్పోతే ఆ తల్లిదండ్రుల వేదన ఎంత దారుణం? ఉన్నత స్థాయికి ఎదుగుతుందని కలలు కన్న బిడ్డ.. రైలు కింద పడి 30 గంటలు నరకయాతన అనుభవించి చివరికి మృత్యుఒడికి చేరిన వేళ వారి ఆవేదన ఏమని చెప్పగలం? ఆ తల్లిదండ్రుల రోదనను ఏమని ఆపగలం? బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో రైలు బోగి, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఎం.శశికళ (22) గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు అపస్మారక స్థితిలోనే ఉండి.. ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది.
బాధిత కుటుంబీకులు, జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన ఎం.బాబూరావు, వెంకటలక్ష్మి ఒక్కగానొక్క కుమార్తె శశికళ దువ్వాడ కళాశాలలో ఎంసీఏలో చేరింది. గత నెల 20 నుంచి రోజూ అన్నవరం స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తోంది. దువ్వాడలో హాస్టల్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంది. బుధవారం ఉదయం గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఆగే క్రమంలో కుదుపునకు తలుపు బలంగా ఢీకొట్టడంతో శశికళ జారి ప్లాట్‌ఫాం, రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయింది.
సుమారు గంటన్నరసేపు ప్రయత్నించి రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీశారు. షీలానగర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్యులు ప్రయత్నించినా.. ఆమె శరీరం సహకరించలేదు. గుండె నుంచి నడుము వరకు ఉన్న ఎముకలతో పాటు, శరీరం లోపల అవయవాలు అంతర్గతంగా దెబ్బతిన్నాయి. రక్తస్రావం ఆగకపోవడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సుమారు 30 గంటల పాటు పోరాడి కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారామ్ తెలిపారు.
ఇవీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన తెలంగాణ విద్యార్థిని