Cheating old women: ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకు డబ్బు ఆశ చూపి మోసానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయంటూ నమ్మించి నట్టేట ముంచాడు. ఆమె వద్ద నుంచే నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భవనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్లో జరిగింది.
cheating in yadadri: యాదగిరిగుట్ట సీఐ జానకీ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లికాబీ (72) వద్దకు శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మైనార్టీ సంక్షేమశాఖ నుంచి ఆమె పేరుపై భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశ చూపాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని ఆమెకు చెప్పి.. ముందుగా మీ సేవలో రూ.15 వేలు డీడీ చెల్లించిన వెంటనే ఖాతాలోకి డబ్బులు జమ వుతాయని నమ్మించాడని అన్నారు. దానికి అధికారినని.. తాను పూర్తిగా సహకరిస్తానని ఆమెను ద్విచక్ర వాహనంపై వంగపల్లికి తీసుకెళ్లాడు. ఆమె పోగు చేసుకున్న కొంత డబ్బు రూ.5800 అతనికి ఇవ్వగా.. మిగతా డబ్బులు ఇస్తేనే వస్తాయని బెదిరించాడు.
fraud in yadadri: దీంతో ఆమె తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అతనికి అప్పగించి.. వాటిని అమ్మి చెల్లించాలని బాధితురాలు కోరింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు వాటిని తీసుకొని ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుంచి ఉడాయించాడని సదరు మహిళ వాయిపోంది. ఎంతకీ రాకపోవడంతో, తాను మోసపోయినట్లు గుర్తించి కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి యాదగిరిగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని ఆదివారం వంగపల్లిలోని సీసీ పుటేజీలను పరిశీలించి ఆ వ్యక్తి చిత్రాలు సేకరించామని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
stranger cheated old woman: యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూర్ గ్రామం నుంచి వృద్ధురాలిని ద్విచవాహనంపై తీసుకెళ్తున్న నిందితుడి సీసీ పుటేజీ ద్వారా అపరిచిత వ్యక్తిని గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి పలు రకాలుగా, ఆన్ లైన్ ద్వారా డబ్బులు మీకు వచ్చాయని.. మీ ఖాతాలో నగదు జమ అవుతాయని తెలిపినా నమ్మవద్దని సీఐ సూచించారు. అప్రమత్తంగా ఉండి దగ్గరిలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని యాదగిరిగుట్ట పట్టణ సీఐ జానకి రెడ్డి తెలిపారు.
నేను ఇంట్లో ఉండగా వచ్చిండు. పిలవగానే నేను బయటకొచ్చినా. మీకు మైనార్టీ నుంచి రూ.50 వేల లోన్ వచ్చింది అన్నాడు. మీ ఊరేదని అడిగితే యాదరిగిగుట్ట అన్నాడు. పేరడిగితే సలీమ్ అని చెప్పాడు. నా పిల్లలెవరు లేరు వాళ్లు వచ్చినాక వస్తా అన్నా. నేను అక్కడికే పోతున్నా కదా.. నిన్ను తీసుకోని పోతా అన్నడు. డీడీ కోసమని నా వద్ద అన్ని డబ్బులు జమచేసి రూ.5800 ఇచ్చినా. తర్వాత వంగపల్లికి తీసుకుని పోయిండు. అక్కడికెళ్లాక ఇంకా పైసలు కావాలన్నడు. నా వద్ద లేవని చెప్పినా. ఫోన్లో ఏదో మాట్లాడి ఏదన్నా వస్తువులు ఉంటే పెడితే ఇస్తారంట చెప్పిండు. నా చెవుల కమ్మలు తీసి అతని చెేతిలో పెట్టినా ఇక అంతే. ఏదో ఫామ్లు తెస్తానని పోయి ఇక అటే పోయిండు. రాలె.- షేక్ మల్లికాబీ, .- బాధితురాలు