Son Killed Mother in Sangareddy : ఆస్తి కోసం తనయుడు తల్లిని హతమార్చిన ఘటన.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పోతులబోగుడలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై దశరథ్ తెలిపిన వివరాలు.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు తనయులు. భర్త లక్ష్మయ్య, ఓ తనయుడు మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేసి అత్తారింటికి పంపారు.
Son Killed Mother for property : మరో కుమారుడు మురళికి వివాహం చేయగా.. భార్యతో పాటు మల్లమ్మతోనే కలిసి ఉంటున్నారు. మురళి చెడు అలవాట్లు, మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు మల్లమ్మ పేరుపై ఉన్న ఆరెకరాల భూమి, బంగారు నగలు ఇవ్వాలని తరచూ ఆమెతో గొడవ పడేవాడు. కూతుళ్లు, కుమారునికి తన ఆస్తిని సమానంగా పంచుతానని తల్లి చెప్పడంతో.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మల్లమ్మను హత్య చేస్తే ఆస్తితో పాటు, నగలు తనకే దక్కుతాయని పథకం వేశాడు.
మంగళవారం రోజున భార్యను పుట్టింటికి పంపించాడు. బుధవారం తెల్లవారుజామున మల్లమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా.. గొంతు నులిమి హత్య చేశారు. గ్రామస్థుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై దశరథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మల్లమ్మ అల్లుడు జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!