Child Murder: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదనే అపోహతో కన్న తండ్రే కొడుకుని కడతేర్చిన ఘటన జరిగింది. మడకశిర పరిధిలోని శివాపురం గ్రామానికి చెందిన కవితతో రామగిరికి చెందిన గంగరాజుకు 2019లో వివాహం జరిగింది. అనంతరం వీరికి ఏడాదిన్నర క్రితం మగబిడ్డ జన్మించాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా కవిత బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లింది.
అయితే నెల రోజుల క్రితం భర్త గంగరాజు కవిత కుటుంబం వద్దకు వెళ్లి.. తనను బాగా చూసుకుంటానని నమ్మబలికి వారి వద్దనే ఉంటూ ఈ నెల 20న ఏడాదిన్నర వయసున్న వికాస్‌ను తీసుకెళ్లి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదనే అపోహతో కన్న కుమారుడినే హతమార్చాడు. మడకశిరకు 40 కిలోమీటర్ల దూరం అయిన పెనుకొండలోని కొండ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో ఉలవల గుట్టపై బాలుడు మృతదేహాన్ని పడేశాడు. మరుసటి రోజు గంగరాజు, బాలుడు ఇంటికి రాకపోవడంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో తమ కుమారుడు చనిపోయాడని బాధితులు ఆరోపించారు.
అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు బాలుడు చనిపోయినట్లు తెలిపారు. కుమారుడి మృతిని తెలుసుకున్న కవిత రోదనలు కుటుంబ సభ్యులు, బంధువులను కంటతడి పెట్టించాయి. ఇప్పటికైనా పోలీసులు నిందితుడి గంగరాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
"పెళైన రెండు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు. మూడో సంవత్సరమే అనుమానించడం మెుదలు పెట్టాడు. పుట్టిన పిల్లవాడు నా పోలికలు లేవని పదే పదే అనుమానించాడు. ఇలా అనుమానంతోనే పిల్లవాడిని చంపేశాడు." -అంజలి, కవిత చిన్నమ్మ
ఇవీ చదవండి: