Software Woman Suspected Death: ఏపీలో గుంటూరు జిల్లా విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ మృతదేహం గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తనూజ(30)దిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై గుంటూరు, విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన తనూజ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమెకు 2018లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మణికంఠతో వివాహమైంది. వీరికి ఒక బాబు. భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కొవిడ్ నేపథ్యంలో కొంతకాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనూజ ఆదివారం ఇంటి నుంచి వెళ్లిందని...ఆమె కోసం వెతికినా ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని శిఖామణి సెంటర్ సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేశారు.
తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ...
ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పోలీసులు తనూజకు సంబంధించిన ఫొటోలతో పోల్చి ఆది ఆమె మృతదేహంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్న తీరు చూసిన పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. గుంటూరులో అదృశ్యమైన ఆమె విజయవాడలో మృతి చెంది పడి ఉండటంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణిస్తే శరీరంపై గాయాలతోపాటు రక్తం మరకలు ఉండాలి. మృతురాలి శరీరంపై అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు. ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన తనూజ ఆరు గంటల వ్యవధిలోనే శవమై తేలింది. ఈ సమయంలో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల వైఫల్యంతో కేసు విచారణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. తనూజకు విజయవాడలో బంధువులు ఉన్నారని, అక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె మృతిపై రెండు నగరాల పోలీసులు సంయుక్తంగా విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తు దశలో ఉన్నదని నగరంపాలెం సీఐ హైమారావు’ తెలిపారు.
ఇదీ చదవండి: