snake bite students : ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కురుపాంలో విషాదం నెలకొంది. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వసతి గృహంలో పాముకాటుకు ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్ధులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో విద్యార్థులను పాము కాటు వేసింది. విషయం గుర్తించిన వసతి గృహం సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడినుంచి పార్వతీపురంలోని మరో ఆస్పత్రికి తరలించారు.
student died: అప్పటికే విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రంజిత్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. విజయనగరంలోని తిరుమల ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు. మృతుడు మంతిని రంజిత్ స్వస్థలం కోమరాడ మండలంలోని దళాయిపేట గ్రామమని.. మరో ఇద్దరు విద్యార్థులు ఈదుబుల్లి వంశీ సాలూరు మండలం జీగారం, నవీన్ చినభోగిలి జగ్గూనాయుడుపేటకు చెందినవారని అధికారులు తెలిపారు.
పరామర్శించిన ఉపముఖ్యమంత్రి...
కురుపాం గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన విద్యార్ధులను ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరామర్శించారు. అనంతరం ఘటనపై ఆరా తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఒక విద్యార్థి మృతి చెందటం విచారకరమన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: లోకేష్
పాము కాటు ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గంలోనే బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థి మృతి చెందడం... ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను... జగన్రెడ్డి సర్కార్ పట్టించుకోకపోవడం వల్లే మృత్యుకేంద్రాలుగా మారాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం.. ముగ్గురు అరెస్ట్