వారంతా దినసరి కూలీలు.. రోజూలాగే ఇవాళ కూడా పనికోసం బయల్దేరారు. ఆటోలో కూర్చొని మాటలు, ముచ్చట్లలో మునిగిపోయారు. వారు కష్టసుఖాలు మాట్లాడుకుంటుండగా.. వాహనం తనదారిన తాను వెళ్తోంది.. కానీ, అల్లంత దూరంలో మృత్యువు మాటువేసింది..! దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంది..! సరిగ్గా వారు ప్రయాణిస్తున్న ఆటో.. హై టెన్షన్ విద్యుత్ స్తంభం వద్దకు చేరుకోగానే.. మిన్ను విరిగి మీద పడ్డట్టుగా.. వేల వోల్టుల "పవర్" ఉన్న విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద తెగిపడ్డాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే మంటలు చుట్టు ముట్టాయి..! ఆటో మొత్తం దగ్ధమైపోతోంది.. హాహాకారాలు.. ఆర్తనాదాలు మిన్నంటాయి.. చూస్తుండగానే ఐదు నిండు ప్రాణాలు నిలువునా మంటల్లో కాలి బూడిదయ్యాయి..! ఇసుమంతైనా తమ పొరపాటే లేని ప్రమాదానికి ఐదుగురు బలైపోయారు..! ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
అసలేం జరిగిందంటే..? తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. ఆటోలో ప్రయాణిస్తున్న వీరు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ.. కొందరికి దుస్సాధ్యంగా మారింది. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
ఐదుగురు సజీవ దహనం : ఆటోకు మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపేశాడు. కానీ.. ఆటో మొత్తం రెగ్జిన్ కవర్ తో కప్పబడి ఉండడంతో.. క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురు సజీవంగా దహనమయ్యారు. తమ స్నేహితులు, తోటి వారిని రక్షించుకునేందుకు మిగిలిన కూలీలు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు.
మృతులంతా మహిళలే : ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దకోట్లకు చెందిన కుమారి కూలీలను పనికోసం తీసుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.