మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మహత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఐ నాగార్జున గౌడ్ మినహా ఆరుగురు నిందితులు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కృష్ణా గౌడ్, సరాఫ్ స్వరాజ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈనెల 16న కామారెడ్డిలో పద్మ ఆమె కుమారుడు సంతోష్ నిప్పంటించుకుని చనిపోగా.. ఏడుగురి పేర్లతో సూసైడ్ నోట్ రాశారు. అప్పటి నుంచి నిందితులు పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారు. ఇవాళ ఆరుగురు స్వచ్చందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అసలేం జరిగిందంటే: రాజకీయ నేతల వేధింపులకు.. చేష్టలుడిగిన పోలీసుల వైఖరికి విసిగివేసారి తల్లీకొడుకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి గంగం సంతోష్(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన పల్లె జితేందర్‌గౌడ్ (పురపాలక సంఘం అధ్యక్షుడు), ఐరేని పృథ్వీరాజ్ అలియాస్ బాలు, సరాబ్ యాదగిరి (మార్కెట్ కమిటీ ఛైర్మన్), తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్, సరాబ్ స్వరాజ్ (యాదగిరి కుమారుడు), తాండూరి నాగార్జునగౌడ్ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ) కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా సందేశాలు పెట్టి ప్రాణాలొదిలారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు.
రాజకీయ నేతల వేధింపులు, పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ మరణానికి వీరే కారణమంటూ ఏడుగురి పేర్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సంతోష్.. తన తల్లితో కలిసి శనివారం కామారెడ్డిలోని ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై పోలీసులు అదే రోజు ఆ ఏడుగురిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. లాడ్జిలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. మృతుల కాల్‌డేటా, మరణ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారాయి.
ఇవీ చదవండి: