Govt land kabza in Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రూ.220కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేశారని షేక్‌పేట తహసీల్దార్ వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీసు టవర్స్ వెనకాల ఉన్న రెండున్నర ఎకరాల స్థలానికి బోగస్ టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్ తయారు చేసి... కబ్జా చేసేందుకు యత్నించారని తెలిపారు. ఈ మేరకు కృష్ణా గ్రూప్స్‌కు చెందిన పార్థసారథిపై ఠాణాలో క్రిమినల్ కేసుతోపాటు భూకబ్జా కేసు కూడా నమోదు చేశారని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 23న ఆ స్థలాన్ని కృష్ణాగ్రూప్స్ పార్థసారథి... సత్తిరెడ్డి అనే వ్యక్తిని నమ్మించి నకిలీ పత్రాలు చూపించారని చెప్పారు.
tahsildar srinivas reddy : నిర్ధరణ కోసం ఆ పత్రాలను తీసుకుని సత్తిరెడ్డి... షేక్‌పేట రెవెన్యూ అధికారులను సంప్రదించడంతో నకిలీ పత్రాలుగా తేలిందని తహసీల్దార్ తెలిపారు. అంతేకాకుండా ఆ స్థలం కూడా ప్రభుత్వానికి చెందినగా అధికారులు వెల్లడించారని అన్నారు. స్థలం చుట్టు కంచె వేయడంతో పాటు ఓ గదిని నిర్మించి ఈ స్థలం కృష్ణాగ్రూప్స్‌కు చెందినదిగా బోర్డు ఏర్పాటు చేశారని... సత్తిరెడ్డి ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన గదిని కూల్చివేయడంతోపాటు ఫెన్సింగ్‌ను కూడా తొలగించారని చెప్పారు. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశామని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
'కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ఈమధ్యే ఫెన్సింగ్ చేశారు. పార్థసారథికి చెందిన భూమిగా ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి దాన్ని వివరాల కోసం వచ్చారు. అవి నకిలీ పత్రాలుగా తేలాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫీల్డు మీదకి పోయి పరిశీలించారు. అక్కడ ఉన్న ఫెన్సింగ్, రూమును తొలగించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఫోర్జరీ డాక్యుమెంట్లు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. రెండింటిపై సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.'
-శ్రీనివాస్ రెడ్డి, షేక్‌పేట తహసీల్దార్
ఇదీ చదవండి: వడ్డీ వ్యాపారుల దోపిడీ.. రుణం పేరుతో విలువైన భూములు స్వాహా