తప్పొప్పుల మర్మం బోధించే.. గురువే తప్పులు చేస్తున్నాడు. ఓనమాలు దిద్దించాల్సిన చిన్నారుల చేతులతో ఒంట్లో ఎక్కడెక్కడో తాకించుకుంటూ.. జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నాడు. అభం శుభం తెలియని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్.. వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచక బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. ఈ అమానవీయ ఘటన.. సూర్యాపేట చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఎంతో నమ్మకంతో.. తమ పిల్లల్ని బతిమాలో బామాలో బెదిరించో పాఠశాలకు పంపిస్తే.. ఆ ఉపాధ్యాయుడు వెలగబెడుతోన్న నిర్వాకం ఇదీ..
ఎలా చెప్పాలో తెలియక..
అడ్లూరు గ్రామానికి చెందిన కొందరు పిల్లలు తమ్మారం పాఠశాలకు వెళ్తున్నారు. రోజూ పాఠశాలకు ఉత్సాహంగా వెళ్లే చిన్నారులు.. రెండు రోజులుగా వెళ్లట్లేదు. ఒంట్లో నలతగా ఉండేమో అని తల్లిదండ్రులు కూడా బలవంతపెట్టలేదు. ఆ తర్వాత కూడా స్కూల్ అంటేనే వణికిపోతున్నారు. ఎంత అడిగినా చెప్పట్లేదు. ఎందుకంటే.. వాళ్లకు ఎలా చెప్పాలో తెలియదు. చెప్పలేని వయసు వాళ్లది. తల్లిదండ్రులు అన్ని రకాలుగా ప్రయత్నించగా.. చివరికి విషయాన్ని తెలియజేశారు. ఆ విషయం విని కుటుంబసభ్యులు కంగు తిన్నారు. ఎంతో నమ్మకంగా పాఠశాలకు పంపిస్తున్న తమ పిల్లల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడా అని కోపంతో ఊగిపోయారు. ఎందుకైనా మంచిదని.. తోటి పిల్లలను కూడా తెలుసుకుందామని అడిగితే.. పూర్తి విషయం బోధపడింది. వెంటనే తల్లిదండ్రులంతా కలిసి సదరు కీచక టీచర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కీచక టీచర్ రాక్షసానందం..
"క్లాసులకు మధ్య పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్.. కొంత మంది పిల్లలను తన గదికి పిలుచుకుని వెళ్లేవాడు. అక్కడ ఆ చిన్నారుల కళ్లకు గంతలు కట్టేసి.. తన ప్రైవేటు పార్టులను వారి చేతులతో తాకించుకుని రాక్షసానందం పొందేవాడు." అని ఆ పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.
స్కూళ్లకు పంపించాలంటే భయపడతారు..
"తండాలో పాఠశాల లేకపోవటం వల్ల.. రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా.. పిల్లల్ని నమ్మకంతో పంపిస్తున్నాం. గతంలో కూడా ఇలా ఓ సారి జరిగింది. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. నిర్భయ, దిశ లాంటి ఘటనలు యువతుల మీద జరిగాయి. ఇప్పుడు అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇలాంటి వారిని ఊరికే వదిలి పెట్టోద్దు. ఇలాంటి నీచుల వల్ల.. పిల్లల్ని చదువుకునేందుకు స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతారు. తండవాసులమైన మాకు న్యాయం జరిగేలా చూడాలి. పిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్ను కఠినంగా శిక్షించాలి." - తండావాసులు
ఇదీ చూడండి: