హైదరాబాద్ న్యూబోయిన్‌పల్లి ఆనంద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నాలాలో పడి ఆనంద్‌సాయి అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన ఆనంద్‌సాయి ఇంటివద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే నాలా వద్ద మరమ్మతులు జరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు.
సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఇంటి ముందే ఆడుకున్న తమ బాబు.. విగతజీవిగా మారటాన్ని చూడి కుటుంబసభ్యులు గుండెలు బాదుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: Online Loan Apps : ఎస్సైనని బెదిరించి ఖాతా ఖల్లాస్