కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.15,000 నగదు ఎత్తుకెళ్లారు.
కౌటాల మండలానికి చెందిన చంచల్ బిశ్వాస్ వృత్తిరీత్యా కాగజ్నగర్ పట్టణంలోని ఈద్గా కాలనీలో కిరాయికి ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి.. సొంతూరుకు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటి యజమాని శ్రీనివాస్ వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే చంచల్ బిశ్వాస్కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని... జాగిలంతో అన్వేషించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని ఏఎస్పీ బాలస్వామి, పట్టణ ఎస్హెచ్వో మోహన్ సందర్శించి వివరాలు సేకరించారు. బాధితుడు చంచల్ బిశ్వాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్వో మోహన్ తెలిపారు.