Series of Chain Thefts: వరుస గొలుసు దొంగతనాలు చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నెల 19న ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వ్యవధిలో నిందితుడు 5 గొలుసు దొంగతనాలు చేశాడు. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో రెండు గొలుసు దొంగతనాలు చేసిన నిందితుడు మరో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపేందుకు విఫలయత్నం చేశాడు.
పోలీసులకు సవాల్‌గా...
ఆ తర్వాత మారేడ్ పల్లిలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లాడు. తుకారాంగేట్ పీఎస్ పరిధిలోనూ మరో మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా మేడిపల్లి పీఎస్ వైపు వెళ్లి అక్కడ వీధిలో ఉన్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లాడు. ఒకే రోజు వ్యవధిలో మూడు కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేసిన నిందితుడు... పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ నెల 18వ తేదీన జియాగూడలో సాయంత్రం 5 గంటల సమయంలో పార్క్ చేసి ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లిన నిందితుడు... ఆ స్కూటీని ఉపయోగించుకొనే గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఉత్తరాదికి చెందిన వ్యక్తా?
నిందితుడి చోరీకి పాల్పడిన తీరు, హిందీలో మాట్లడటాన్ని బట్టి... అతను ఉత్తర భారతానికి చెందిన వాడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన స్కూటీని పోలీసులు మేడిపల్లిలోని సంపూర్ణ హోటల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. అతను ఎటువైపు పారిపోయి ఉంటాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: Hyderabad Chain Snatching: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన గొలుసు దొంగలు... ఐదు చోట్ల...