Railway TTI Wife Arrested : రైలెక్కేందుకు వెళ్తున్న మహిళ హ్యాండ్‌బ్యాగులోని నగలను తస్కరించిన నిందితురాలిని ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు రైల్వే టీటీఐ భార్య కావడం గమనార్హం. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనూరాధ, డీఎస్పీ నర్సయ్య, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు ఎం.శ్రీను, నర్సింహ ఆ వివరాలు వెల్లడించారు.
'కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీ తులసీనగర్‌లో ఉండే వెంకటేశ్ రైల్వేలో టీటీఐగా పని చేస్తున్నారు. ఆయన భార్య అరూరి ప్రియ(40) డబ్బుపై ఆశతో చోరీలకు పాల్పడుతోంది. నిజాంపేట్‌లో ఉండే వెంకాయమ్మ తన కుమార్తె శ్రీమంతం మణుగూరులో ఉండటంతో ఆమె బంగారాన్ని తీసుకుని 17న రాత్రి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. 4వ నంబరు గేట్ నుంచి వస్తుండగా నిందితురాలు ఆమెను వెంబడించి లిప్టులో రద్దీని ఆసరా చేసుకుని కొంగును హ్యండ్‌బ్యాగుపై కప్పి బంగారు నగల బాక్స్ దొంగిలించింది. ప్లాట్‌ఫారం వద్దకెళ్లిన వెంకాయమ్మ బ్యాగులో నగల బాక్స్ లేకపోవడాన్ని గుర్తించి జీఆర్పీ మాకు ఫిర్యాదు చేసింది.' అని రైల్వే పోలీసులు తెలిపారు.
రైల్వే డీజీపీ ఆదేశాలతో డీఎస్పీ నర్సయ్య, సీఐ శ్రీను నేతృత్వంలో 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని గుర్తించి ఈనెల 20న అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పేట్‌బషీరాబాద్ ఠాణాల పరిధుల్లో చోరీలకు పాల్పడి అరెస్టైంది. ఆమె నుంచి 53 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.