గతేడాది సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి వైద్య కళాశాల మంజూరైంది. అందులో విధులు నిర్వహించేందుకు పొరుగు సేవల కింద కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ల్యాబ్ అటెండెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్.. ఇలా 33 పోస్టులను కేటాయించారు. వీటి నియామక బాధ్యతలు.. అప్పటి కలెక్టర్ ఓ ఏజెన్సీకి అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలను తమకు అనువుగా మార్చుకుని.... సదరు ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థులకు రాత పరీక్షలు, ముఖాముఖి నిర్వహించకుండానే... మొక్కుబడిగా ఎంపిక చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 32 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో... 20 మంది మాత్రమే ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. ఎప్పటివరకు దరఖాస్తులు స్వీకరించారనే విషయంపై స్పష్టతలేదు. రాత, మౌఖిక పరీక్షల తేదీలు చెప్పకుండా... ఏజెన్సీ తమకు నచ్చిన వారిని ఎంపిక చేసి... ఆ వివరాలు వైద్య కళాశాల అధికారులకు అందించారని అంటున్నారు. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్క పోస్టుకు 2 లక్షల నుంచి 3లక్షల వరకు నిర్వాహకులు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. సాంకేతికపరమైన ఉద్యోగాలకు మాత్రమే ముఖాముఖి నిర్వహించి.. అర్హుల జాబితా ఏజెన్సీకి పంపించామని... వైద్య కళాశాల ప్రిన్సిపల్ వాణి స్పష్టం చేశారు. అందులోంచి అభ్యర్థులను ఏజెన్సీ వారే ఎంపిక చేశారని తెలిపారు.
కలెక్టర్‌గారు ఏజెంట్‌ను ఎంపిక చేసి ఇచ్చారు. సాంకేతికపరమైన ఉద్యోగాలకు మాత్రమే ముఖాముఖి నిర్వహించి.. అర్హుల జాబితా ఏజెన్సీకి పంపించాం. అందులోంచి అభ్యర్థులను ఏజెన్సీ వారే ఎంపిక చేశారు. - డా. వాణి, ప్రిన్సిపల్, సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల
అదనపు కలెక్టర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంయుక్తంగా ఈ వ్యవహారంపై ఉద్యోగాలు పొందిన వారిని విచారించారు. వీరిలో కొంత మంది తమకు జీతం ఎంతో కూడా తెలియదని చెప్పడంతో... అధికారులు అవాక్కయ్యారు. ఏజెన్సీ నిర్వాహకులకు పలుకుబడి ఉండటంతో... ప్రభుత్వంలోని పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. సదరు ఏజెన్సీ తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. గతంలో చేపట్టిన నియామకాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటపడతాయని... తమకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు అంటున్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తే.. మరోసారి ఇలాంటివి పునరావృతం కావని చెబుతున్నారు.
ఇదీ చూడండి : జలపాతం వద్ద పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు!