ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆర్టీసీ బస్సు కింద ద్విచక్ర వాహనం పడిన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
టవర్ క్లాక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆర్టీసీ బస్సు ఆగింది. సిగ్నల్ పడిన వెంటనే బస్సు ముందుకు బయలుదేరింది. ఇంతలో రాంగ్రూట్లో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు మహిళలు బస్సు ముందు వైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ లోపే బస్సు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం బస్సు ముందు చక్రం కింద పడింది. ఈ ఘటనలో మహిళల కాళ్లు విరిగిపోయాయి. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మహిళలను ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నిదానమే ప్రధానము.. ఆలస్యమైనా ముందు వెనకా చూసి ప్రయాణించాలని" క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. అనవసరంగా రాంగ్ రూట్లో వస్తే ప్రమాదాల బారిన పడతారని కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బార్ ఎదుట యువకుల వీరంగం.. యజమానిపై దాడి