Medaram Road accident Today : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొని డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కారులో పెళ్లి చూపులకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేడారం సమీపంలోని గట్టమ్మ ఆలయం సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
అన్న కుమారుడి కోసం పెళ్లి చూపులకు వెళ్తుండగా
వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుంభంపాటి శ్రీనివాస్(48)... తన అన్న కుమారుడి కోసం పెళ్లి సంబంధం మాట్లాడటానికి మహబూబాబాద్ జిల్లా నెక్కొండకు వెళ్తున్నారు. బంధువులు సుజాత(40), రమేశ్(45), జ్యోతితో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గట్టమ్మ ఆలయం సమీపానికి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న హనుమకొండ డిపోకు చెందిన మేడారం జాతర ప్రత్యేక బస్సు.. కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలంలోనే నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో చంద్రుపట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ కల్యాణ్(26) ఉన్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో... పోలీసులు క్రేన్ సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. బస్సు ముందు భాగం కొంత దెబ్బతింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన జ్యోతిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మరోవైపు మృతుడు శ్రీనివాస్ అన్న కుమారుడు.. మరో వాహనంలో హైదరాబాద్ నుంచి బయలుదేరడంతో ప్రమాదం బారిన పడలేదు.
విషాదంలో గ్రామాలు
మేడారం జాతరకు వెళ్లే మార్గం కావడంతో.. కొద్ది సేపట్లోనే ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే క్రేన్ సాయంతో.. కారును రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుర్ఘటనతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మంత్రి సత్యవతి దిగ్భ్రాంతి
Mulugu Accident Today : ఘటన పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరో బస్సు.. 50 మందికి గాయాలు