cotton wicks manufacturing fraud: దూది మాదే.. తయారీ యంత్రం మాదే.. జస్ట్ వత్తులు తయారీ చేసి ఇస్తే.. కిలోకు 600 రూపాయలు. ఇంకేముంది ఇంట్లోనే పని.. చేసుకుంటే సంపాదించుకోవచ్చు అని ఆశపడ్డారు. వాళ్లు అడిగినంత డిపాజిట్లు కట్టారు. రెండు నెలలు సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఆ కంపెనీ 600 మందికి కుచ్చుటోపీ పెట్టి... బోర్డు తిప్పేసింది. ఈ ఘటన ఎక్కడో కాదు.. హైదరాబాద్ శివారు ప్రాంతం బోడుప్పల్‌లో చోటుచేసుకుంది.
దూదీపేరుతో మెత్తగా దోచేశారు: దీపం వెలిగించే వత్తులు తయారు చేయాలని చెప్పి ప్రజలను మభ్య పెట్టిన సంస్థ భారీగా డబ్బులు దండుకుని బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. బోడుప్పల్‌లో ఏబీజీ మ్యానుఫ్యాక్చరింగ్ పేరిట ఓ సంస్థ సంవత్సరం క్రితం వెలిసింది. దీపాలు వెలిగించడానికి ఉపయోగించే వత్తులను తయారు చేయాలని... ఇందుకోసం డిపాజిట్ కింద 1.70 లక్షల రూపాయలు చెల్లిస్తే తయారీ యంత్రం ఇస్తానని సంస్థ యజమాని బాలస్వామి తెలిపినట్టు బాధితులు చెప్పారు. వత్తుల తయారీకి ఉపయోగించే దూది కూడా కిలో మూడు వందల రూపాయలకు తన వద్దే కొనుగోలు చేసి... కిలో వత్తులను తయారు చేసి తనకు విక్రయిస్తే 600 రూపాయలు ఇస్తానని ఆ సంస్థ యజమాని సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర మార్గాల్లో ప్రచారం చేసుకున్నట్టు బాధితులు వివరించారు. ఇది నమ్మిన పలువురు అతను చెప్పిన విధంగా 1.70 లక్షల రూపాయలు డిపాజిట్లు చెల్లించారు.
600మందికి కుచ్చుటోపీ: తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఈ విధంగా సంస్థ నిర్వాహకులకు డిపాజిట్లు చెల్లించారు. మొదట రెండు నెలలు... నిర్వాహకులు ముందుగా ప్రకటించినట్టు డబ్బులు చెల్లించారు. దీంతో పూర్తిగా నమ్మిన పలువురు బంగారం, ఇండ్ల స్థలాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించారు. కొందరైతే అప్పులు కూడా తీసుకుని చెల్లించారు. గత మూడు, నాలుగు నెలలుగా సంస్థ యజమాని డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించడం మానేశాడు. వత్తుల తయారీకి దూది కూడా ఇవ్వడం లేదు. క్రమంగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఉన్నదంతా ఊడ్చేసి డబ్బులు కట్టామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్‌లోని సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 500 నుంచి 600 మంది ఇప్పటి వరకు డిపాజిట్లు చెల్లించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 20 కోట్ల రూపాయలకు పైగా సంస్థ నిర్వాహకులు దండుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కేసు నమోదు చేసి నిందితుడి పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్‌లో చూసి అందులో చేరాం. ఇక్కడికి వచ్చాం. అంతా నమ్మించాం. ఒక కేజీకి 300 రూపాయల డిపాజిట్ కట్టాలి. మిషన్‌కు లక్ష 20వేల రూపాయలు కట్టాం. రోజుకు నాలుగు కిలోలు చేసుకున్న 1200 వస్తాయని అనుకున్నాం. కానీ మొత్తానికే ముంచుతాడని అనుకోలేదు. - బాధితులు
నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా మోసగాళ్ల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానం వస్తే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి..