Rowdy Gangs Attacks in Hyderabad: పోలీసులంటే భయం లేదు. ఎదుటివారి పట్ల జాలిలేదు. తమనెవరూ ఆపేదనే రీతిలో రెచ్చిపోతూ.. విచక్షణారహితంగా రౌడీమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా లంగర్‌హౌజ్‌కు చెందిన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి, నగ్నంగా నిలబెట్టి.. బెల్టుతో కొడుతున్న దృశ్యాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాజేంద్రనగర్‌లో ఓ షాపులోకి చొరబడి.. దుకాణదారుడి ప్రాణాలు తీసేంత పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే హైదరాబాద్‌లో రౌడీమూకల అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Rowdy Gangs Attacks on People in Hyderabad : క్యాబ్‌డ్రైవర్ ఆలస్యంగా వచ్చాడని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో ఇటీవల ఓ క్యాబ్‌డ్రైవర్‌ను కనికరం లేకుండా కొట్టారు. సోమవారం అత్తాపూర్‌లో ఆటోమొబైల్ యజమానిపై ఓ ముఠా దాడిచేసింది. సంపత్‌రెడ్డి అనే వ్యక్తి తన షాపు ముందు నిలిపిన వాహనాన్ని పక్కకు తీయాలని సూచించాడు. ఈ క్రమంలోనే షాప్‌లోకి చొరబడిన 20మంది సంపత్‌పై పిడిగుద్దులతో రెచ్చిపోయారు. దుకాణంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి.. అందులోని వస్తువులతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన సంపత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన మరువక ముందే నిన్న సాయంత్రం లంగర్‌హౌజ్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా పనిచేసే యువకుడిని ఎత్తుకొచ్చిన రౌడీ గ్యాంగ్.. విచక్షణ లేకుండా నగ్నంగా నిలబెట్టి, బెల్టుతో కొట్టారు. లంగర్‌హౌజ్‌కు చెందిన ఇర్ఫాన్ నలుగురైదుగురి ముఠా కిడ్నాప్ చేసి రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడకు తీసుకువచ్చారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఇర్ఫాన్ బట్టలు విప్పి, బెల్టుతో కొట్టారు. యువకుడు ఎంత వేడుకుంటున్నా కనికరించకుండా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
తమ మాట వినకుంటే అందరి గతి ఇంతేనంటూ యువకుడిని హెచ్చరిస్తున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి రౌడీమూకల ఆగడాలకు అమాయకులు భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. తాము ఎదురేలేదనే విధంగా అకృత్యాలకు పాల్పడుతున్న రౌడీలకు పోలీసులే భయం కలిగించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: