Drugs Manufacturing at Home : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంట్లోనే మత్తు పదార్థాలు తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడు శ్రీరామ్‌తో పాటు వినియోగదారుడు దీపక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు వీరిద్దరికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారం రోజున శ్రీరామ్‌ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు.. అతడి ఇల్లు, ల్యాబ్‌ను చూసి అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే.. : సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ హైదరాబాద్ కొండాపూర్‌లో తన ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు. దాదాపు రెండేళ్ల పాటు ప్రయోగాలు చేసి మత్తు మందు తయారు చేశాడు. మొదట తన స్నేహితులపై పరీక్షించి డ్రగ్స్ పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత వాటిని ఇతరులకు విక్రయించడం మొదలు పెట్టాడు. అలా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దీపక్‌కు విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న నార్కోటిక్ విభాగం శ్రీరామ్‌తో పాటు దీపక్‌ను కూడా అరెస్టు చేసింది. వీరి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్, తయారీ పరికరాలు, రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని వైద్య పరీక్షల అనంతరం ఇవాళ రిమాండ్‌కు తరలించారు.