లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి చోరీల బాట పట్టారు. డాలర్లను రూపాయలుగా మార్చుకునే క్రమంలో అవతలి వ్యక్తుల దృష్టి మరల్చి.. ఇరాన్ ముఠా చోరీలకు పాల్పడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ముగ్గురు సభ్యుల ఇరాన్ ముఠాను అరెస్ట్ చేసింది.
నిందితుల నుంచి 35వేల నగదు, 811 అమెరికా డాలర్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్, రజబ్, నసీర్ అనే ముగ్గురు ఇరానీయులు కొన్ని నెలల క్రితం దిల్లీకి వచ్చారు. మన దేశానికి సంబంధించిన వస్త్రాలకు టెహ్రాన్‌లో డిమాండ్ ఉండటంతో వస్త్రాలను ఎగుమతి చేశారు. దిల్లీలో కొంత కాలంగా లాక్డౌన్ ఉండటంతో.. వ్యాపారంలో నష్టాలు రావడంతో హైదరాబాద్ బాట పట్టారు. టోలీచౌకీలో గది అద్దెకు తీసుకొని చోరీలబాట ఎంచుకున్నారు. డాలర్లను తీసుకొని రూపాయలు ఇవ్వాలంటూ మాటల్లో దించి ఎదుటి వ్యక్తులు ఇచ్చే డబ్బులను లెక్కించే సమయంలో వాళ్లకు తెలియకుండా నగదును నొక్కేస్తున్నారు. దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారుల దృష్టి మరల్చి నగదును చోరీ చేస్తున్నారు. నార్సింగి, రాజేంద్రనగర్, కార్ఖానా, ఎల్బీనగర్ పీఎస్‌ల పరిధిలో 5 చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.