Ganja Seized in hyderabad: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 44 లక్షల వరకు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్న భువనగిరి ఎస్‌వోటీ, రామన్నపేట పోలీసులను సీపీ అభినందించారు.
5 రెట్లకు విక్రయం
ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో గంజాయిని రూ. 2 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 10 వేలకు విక్రయిస్తున్నారని సీపీ భగవత్ తెలిపారు. అక్కడి నుంచి నగరానికి తీసుకువస్తుండగా చౌటుప్పల్ వద్ద ఎస్‌వోటీ పోలీసులు వీరిని రామన్నపేట వైపునకు దారి మళ్లించి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. అప్రమత్తమైన రామన్నపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని సీపీ వివరించారు. ప్రధాన నిందితుడు తిరుపతి గతంలో కల్వకుర్తిలో అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు. క్యాబ్ నడుపుతూ ఉపాధి పొందుతున్న తిరుపతి.. సులభంగా డబ్బు సంపాదించవచ్చని గంజాయి సరఫరాదారుడిగా మారాడని వివరించారు. గతంలో మహారాష్ట్రకు చెందిన ముఠా వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని.. ఇప్పుడు అతనే సరఫరాదారుడిగా మారాడని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని.. సంయుక్త ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్నాం. అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురిని అరెస్టు చేశాం. రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
సొంతూళ్లకు వెళ్తున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు
ఊరికి వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దు
పండక్కి ఊరెళ్తున్నారా.?
నగరంలో ఇళ్లకు తాళాలు వేసి.. సంక్రాంతికి సొంతూరు వెళ్తున్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. ఈ మేరకు జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్‌ను సీపీ విడుదల చేశారు. ఇళ్లకు తాళాలు వేసి ఊరికివెళ్తే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. బంగారం, వెండిని ఇంట్లో పెట్టవద్దని సూచించారు. ఊరికి వెళ్తున్నామనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకూడదని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే.. ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచుతామని సీపీ చెప్పారు.
పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు. నగలు, నగదును ఇంట్లో ఉంచి వెళ్లొద్దు. స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే గస్తీ పెంచుతాం. - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలపైనా దృష్టి పెట్టామన్న మహేశ్ భగవత్.. మహేశ్వరంలో కోడి పందేలు ఆడుతున్న 13మందిని అరెస్ట్ చేసామని తెలిపారు. మేడిపల్లిలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.
ఇదీ చదవండి: Govt Teacher Died: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి.. బదిలీ ఆందోళనతోనేనా..?