షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఓ వైద్యుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్ 2007లో వైద్య విద్యను అభ్యసించడానికి చైనా వెళ్లాడు. ఆ సమయంలోనే మావో జిబిన్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. ఇండియాకు వచ్చినప్పటికీ 4ఏళ్ల నుంచి అతనితో పరిచయం కొనసాగిస్తున్నాడు.
ఇండోర్‌లో కార్యాలయం...
విదేశీ మారకద్రవ్య మార్పిడికి సంబంధించిన వ్యాపారం చేయాలని మావో జిబిన్, నారాయణ్‌లు కలిసి ప్రణాళిక రచించారు. దీనికోసం ఇండోర్‌లో ఓ కార్యాలయాన్ని, ఫెడరల్ బ్యాంకులో ఖాతాను ఆదిత్య తెరిచాడు. మోనిక అనే మహిళ సాయంతో మావో జిబిన్ పలువురిని ఆకర్షించాడు.
రూ.41 లక్షల నగదు డిపాజిట్...
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ వ్యక్తి విదేశీ మారకం కోసం వీరిని సంప్రదించాడు. మోనికా బ్యాంకు ఖాతాలో రూ.41లక్షల నగదు డిపాజిట్ చేశాడు. ఆదిత్య సాయంతో మోనికా బ్యాంకు ఖాతాలోని డబ్బును మావో జిబిన్ తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు.
మోసపోయానని...
చివరికి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదిత్య నారాయణ్‌ను అరెస్ట్ చేసి అతని నుంచి ఖరీదైన చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో పాటు అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.11.5 లక్షలను జప్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న జిబిన్, మోనికాల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఈ-ఓటరు గుర్తింపు కార్డును ఆవిష్కరించిన ఎస్ఈసీ