కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, ఈజ్ గాం ప్రాంతాల్లోని పలువురు దళారులు ముంబయి తదితర ప్రాంతాల్లోని మట్కా నిర్వాహకులతో కలిసి మట్కా జూదం దందా చేస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్ పట్టణంలోని గల్లీల్లో అడ్డాలు ఉండగా పోలీసులు దాడులు నిర్వహించి మట్కా నిర్వాహకులను, ఆడినవారిని పట్టుకొని కేసులు మోదు చేశారు. మట్కా జూదంలో నష్టపోయిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అంకెల గారడి..
కల్యాణి.. ముంబయి.. రాజధాని.. ఇవి మట్కా నిర్వహించే సంస్థల పేర్లు. మట్కా అంటే కుండ అని అర్థం. గతంలో కుండలో కొన్ని నెంబర్లు వేసి లాటరీ పద్ధతిలో ఒక్కదాన్ని తీసేవారు. ఆ నెంబర్‌ను ఊహించి చెప్పిన వారికి డబ్బులు చెల్లించే వారు. కాలక్రమేణా లాటరీ నెంబర్లను అంచనా వేసి దానిపై తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఎక్కువ మొత్తంలో రాబట్టుకునే వ్యాపారంగా రూపుదాల్చింది మట్కా. ఆదివారం, పండుగ రోజుల మినహా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ప్రారంభ సంఖ్యను ప్రకటించి గంట వ్యవధిలో చివరి అంకెను ప్రకటిస్తారు. తాను ఊహించిన నెంబరు తగిలితే 10 రూపాయలకు 500 నుంచి 1000 రూపాయల వరకు చెల్లిస్తుంటారు. మట్కా చార్ట్‌లో అంకెల గారడిని గుర్తించి స్వయంగా ఊహించి ప్రస్తుతం నడుస్తున్న నెంబరు ఎంత.. తర్వాత వచ్చే నెంబరు ఎంత అని అంచనాలు.. లెక్కలతో సాగే జూదమే ఈ మట్కా. కొంతమంది అదృష్ట సంఖ్య, వివిధ దినపత్రికల్లో వచ్చే రాశి ఫలాలు చూసి ఈ ఆటలో పాల్గొని రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును మట్కా రూపంలో కోల్పోతున్నారు.
ఆన్లైన్ దందా షురూ..
కాగజ్‌నగర్ పట్టణంలోని తీరందాజ్ చౌరస్తా, రైల్వే స్టేషన్, ద్వారకా నగర్, చింతగూడ, సర్ సిల్క్ ఏరియా, ఈజ్ గాం, తదితర ప్రాంతాల్లో మట్కా నిర్వాహకుల ఆధ్వర్యంలో ఇది కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తమ చరవాణి నెంబర్ ద్వారా ఏజెంట్‌ను సంప్రదించి తమ నెంబర్ బుక్ చేసుకుంటున్నారు. పది రూపాయలకు వెయ్యి రూపాయలు వస్తాయని ఆశపడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్‌లో బడా వ్యాపారులు, మధ్యతరగతి వారితో పాటు రోజువారి కూలీలు కూడా భాగస్వాములు అవుతున్నారు.
ఆడితే.. అరెస్టే..
కాగజ్‌నగర్ పట్టణంలో మట్కా నిర్వహణ.. ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్.ఎచ్.ఓ. మోహన్ తెలిపారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామని వారి నుంచి చరవాణీలు, కంప్యూటర్లు, నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మట్కా నిర్వహణపై సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి మట్కా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి: Doctors Death: కొవిడ్ రెండో దశలో 25 మంది మృతి