Demands on Vanama raghava Arrest : పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ... కొత్తగూడెంలో విపక్షపార్టీలు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న బంద్ కొనసాగుతోంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ఐకాస ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా చేపట్టి... బస్సులను అడ్డుకుంటున్నారు.
కొనసాగుతున్న బంద్
వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు నైతిక బాధ్యతగా వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ధర్నా చేశారు. బస్సులను అడ్డుకుంటూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలి. రౌడీషీట్ తెరవాలి. నగర బహిష్కరణ చేయాలి. పీడీ యాక్టు నమోదు చేయాలి. అలా అయితేనే ఇక్కడి ప్రజలకు రక్షణ. ఆ సెల్ఫీ వీడియో చూసిన ప్రతీఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ వీడియో సీఎం దాకా చేరింది. అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వనమా వెంకటేశ్వరరావు నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి. లేదంటే పార్టీ సస్పెండ్ చేయాలి.
-కాంగ్రెస్ శ్రేణులు
వనమా రాఘవ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ కేసుతోపాటు మిగతా ఘటనలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాఘవ తండ్రి తెరాసలో ఉన్నా... రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా అది ప్రభుత్వానికి తీవ్రమైన తలవంపులుగా మేం భావిస్తున్నాం. వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలను ఈ ఘటన ఓ పరాకాష్ఠ. 1989ఇటువంటివి చాలా జరిగాయి. వీరు గతంలో చేసిన నేరాలన్నీ కూడా బయటకు తీయాలి. మామూలు కేసులాగా కాకుండా ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి. దానిపై సమగ్ర విచారణ జరపాలి. రాఘవపై రౌడీషీటు ఓపెన్ చేయాలి.
- కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే
కొత్తగూడెం నియోజకవర్గం బంద్ దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బంద్‌కు అనుమతి లేదంటున్నారు. విపక్ష పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీపీఐ నేత శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆగడాలకు అడ్డే లేదా..?
వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ దాదాపు మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం కేంద్రంగా ఆయన సాగిస్తున్న ఆగడాలకు అడ్డేలేదు. వాటిని చూస్తే సినిమాల్లో చూపించే విలన్ పాత్రలెన్నో గుర్తుకొస్తాయి. ఆయన వేలుపెట్టని వివాదమే ఉండదంటే అతిశయోక్తికాదు. తండ్రి వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యుడు కావడం, కొంతకాలం మంత్రిగా కూడా పనిచేసి ఉండటంతో అధికార యంత్రాంగం కూడా రాఘవేంద్రరావు కొమ్ము కాసేదనేది నిర్వివాదాంశం. అధికారికంగా రాఘవపై ఆరు కేసులే నమోదయ్యాయి. కానీ నమోదు కాని దురాగతాలకు లెక్కేలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయన అరాచకాలపై పెద్ద చర్చే జరుగుతుంటుంది. తండ్రి శాసనసభ్యుడిగా ఎన్నికయిప్పటి నుంచీ తన నియోజకవర్గం పరిధిలో అధికారుల బదిలీలు మొదలు భూవివాదాలు, ఆస్తి వ్యవహారాలే కాదు.. చివరకు వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలెన్నో ఉన్నాయి.
ఇవీ చదవండి: