రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు వద్ద గల రేవతి రైస్ మిల్లు నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 58 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రైవర్లు టేకు సంతోష్, రామును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే మిల్లులో తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
వాహనాల యజమాని పర్వతం తిరుపతి లబ్ధిదారుల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి రేవతి రైస్ మిల్లులో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు. రైస్ మిల్లు యజమాని కముటాల విశ్వేశం ఆ బియ్యాన్ని మిల్లులో పట్టిన బియ్యంలో కలిపేసి మరింత ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య