Police searched in Sunil Kanugulu offices: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల తనిఖీలు మంగళవారం అర్ధరాత్రి వరకూ కాక రేపాయి. నోటీసులివ్వకుండా ఎందుకొచ్చారంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు హైడ్రామా కొనసాగింది. తాజాగా ఈ సోదాలకు సంబంధించి హైదరాబాద్ అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘‘మాదాపూర్‌లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ కార్యాలయంలో చాలా రహస్యంగా ఆఫీస్ పెట్టి నడుపుతున్నారు. గత ఆరు నెలల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో సోదాలు చేసి తర్వాత మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను అదుపులోకి తీసుకున్నాం. వీరంతా సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించాం. నిన్నటివరకు ఎవరు చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియదు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోనే ఈ కార్యాలయం నడుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సునీల్ పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నోటీసులు మాత్రమే ఇచ్చాం. ఎవరినీ అరెస్టు చేయలేదు. మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం రిజిస్టర్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీ పేరుతో రిజిస్టర్ కాలేదు’’
‘‘ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజం. ముఖ్యంగా రాజకీయాల్లో విమర్శలు ఆరోగ్యకరంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. ముఖ్యంగా మహిళను కించపరుస్తూ అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం విమర్శ కిందకు రాదు. అందులోనూ విమర్శలు చేసేవారు ధైర్యంగా వారు చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పగలగాలి. ఎవరికి అర్థం కాని పేరుతో పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా చేస్తున్నారంటే వారెవరో ఇతరులకు తెలియకూడదనే ఇదంతా చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఎవరు ఎక్కడి నుంచి పోస్టులు చేసినా అందుబాటులో ఉన్న సాంకేతికతతో కనిపెట్టడం కష్టమైన పని కాదు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించిన విషయాలనూ తెలుసుకున్నాం. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. నిన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారికి 41సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి వదిలేశాం. పది ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సీపీయూలు స్వాధీనం చేసుకున్నాం. పూర్తిగా చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది’’ అని అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్ వివరించారు.
ఇవీ చదవండి: