Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్ ఉప్పల్‌లో గత శుక్రవారం తెల్లవారుజామున తండ్రీకొడుకులు దారుణహత్యకు గురైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. హనుమసాయి కాలనీకి చెందిన నరసింహమూర్తి, తన కుమారుడు శ్రీనివాస్‌ను దుండగులు గొడ్డలితో దాడిచేసి చంపేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలించినా.. అప్పటికే దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఆస్తి కోసమే బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తొలుుత భావించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ప్రమేయం లేదని తేలటంతో బంధువులను విడిచిపెట్టి మరో కోణంలో విచారణ జరిపారు. 12 బృందాలుగా ఏర్పడి ఘటనాస్థలంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సీసీకెమెరాల నుంచి ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు దుండగులు నరసింహమూర్తి ఇంటి సమీపంలో ఉన్న హాస్టల్ వైపు నుంచి వచ్చినట్లు నిర్ధారించికున్నారు.
హాస్టల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతో నిందితులను గుర్తించారు. హత్యకు గురైన నరసింహామూర్తి ఇంటి వద్దే ఉంటూ తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెబుతుంటారు. నిత్యం చాలా మంది ఆయన వద్దకు వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సరూర్‌నగర్ మండలం మామిడిపల్లికి చెందిన 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఉప్పల్‌లో తన అమ్మమ్మ వారింటి వద్దే ఉండే యువకుడు తరచూ నరసింహామూర్తిని కలుస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ఆయనను సలహా అడగటంతో.. నరసింహామూర్తి యువకుడితో కొన్నాళ్లుగా పూజలు చేయిస్తూ వచ్చాడు. చేసిన పూజలతో ఫలితం లేకపోగా పెద్దఎత్తున డబ్బు ఖర్చు కావటంతో యువకుడు నరసింహమూర్తిపై కోపం పెంచుకున్నాడు.
తన ముగ్గురు స్నేహితుల సహకారంతో నరసింహమూర్తిని అంతమొందించాలని ప్రణాళిక రూపొందించాడు. నరసింహమూర్తిని హత్య చేసేందుకు తన ఇంటి వద్దే ఉన్న హాస్టల్‌లో దిగిన యువకులు ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఎవరూ ఉండరని.. రెక్కీ ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశించి కూర్చీలో కూర్చున్న నరసింహమూర్తిపై గొడ్డలితో దాడిచేశారు.
తండ్రి అరుపులు విని, బయటికి వచ్చిన కుమారుడు శ్రీనివాస్‌పైనా దాడిచేసి దారుణంగా హతమార్చారు. హాస్టల్ నిర్వాహకులిచ్చిన సమాచారం లభ్యమైన పలు ఆధారాలతో నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
ఉప్పల్ తండ్రీకుమారుల హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
ఉప్పల్‌లో జోతిష్యుడి దారుణ హత్య.. అడ్డుకోబోయిన కొడుకు కూడా..
ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్‌లో 20 గంటలుగా ఈడీ సోదాలు
భార్యపై అనుమానం.. కత్తితో 15సార్లు పొడిచి హత్య.. 12ఏళ్ల బాలుడి తల నరికి..