రైతు నుంచి పట్టపగలు నగదు సంచిని లాక్కెళ్లిన ఘటనలో నల్గొండ పోలీసులు నిందితులను గుర్తించి చోరీ చేసిన నగదును రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ చోరీ సొత్తును బాధిత రైతు నర్సయ్యకు అందజేశారు.
ఈ నెల 1న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారానికి చెందిన రైతు చెరుకు నర్సయ్య తన వ్యవసాయ భూమిని నకిరేకల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 6.04 లక్షలు అప్పుగా తీసుకున్నారు. గ్రామానికి చెందిన సుదర్శన్‌రెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై సొంతూరికి వెళ్తుండగా శాలిగౌరారం మండలం పెర్కకొండారం వద్ద కల్వర్టు పనులు జరుగుతుండటంతో నర్సయ్య బైకు నుంచి దిగారు. ఇదే అదునుగా భావించి శిరస్త్రాణం ధరించి ద్విచక్రవానంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన చేతిలోని నగదు సంచి లాక్కుని పారిపోయారు.
చోరీ విషయంపై బాధితులు శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేవలం పదిరోజుల్లో నిందితులను గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పాత నేరస్థులు కాశీ, పరశురాములుతో పాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. చోరీ చేసిన నగదు రూ.6.04 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకుని గురువారం ఎస్పీ బాధిత రైతు నర్సయ్యకు అందజేశారు. నిందితులు పరారీలో ఉండడంతో వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. నగదు రికవరీ చేయడంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ మొగిలయ్య ఇతర సిబ్బందిని ఎస్పీ ఏవీ రంగనాథ్ అభినందించారు.
ఇదీ చూడండి: 5 ఏళ్లలోపు వాహనాలతోనే 44 శాతం రోడ్డు ప్రమాదాలు