ఓ వివాహిత కిడ్నాప్ కేసును 23 నిమిషాల్లోనే మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు ఛేదించారు. అపహరణకు గురైన మహిళను తరలించే కారును సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి పట్టుకున్నారు. ఆమెను పస్రా ఠాణాలో అప్పగించారు.
ములుగు జిల్లాకు చెందిన ఓ యువతికి ఏటూరునాగారం యువకుడితో గత నెల రోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు గోవిందరావుపేట మండలం పస్రాలో ఉంటున్న తన భర్త ఇంటి నుంచి వివాహితను కిడ్నాప్ చేసి కారులో మహబూబాబాద్ మీదుగా సూర్యాపేటకు తీసుకెళ్తున్నారు.
యువతి అరుపులతో..
కురవి మండలం చింతపల్లి టోల్‌గేట్ వద్దకు రాగనే తనను కాపాడండి అంటూ మహిళ అరుపులు పెట్టింది. ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి ఎస్పీ కోటిరెడ్డికి సమాచారం అందించాడు. ఎస్పీ మరిపెడ పోలీస్ స్టేషన్‌కు వెంటనే విషయం తెలిపి కారు పట్టుకోవాలని ఆదేశించారు.
సీఐ సాగర్ నేతృత్వంలో మరిపెడ, సీరోలు, చిన్నగూడూరు ఎస్సైలు నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు. మరిపెడలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కారు నంబర్‌తోపాటు అది వెళ్లే దిశను గుర్తించారు.
సీసీ కెమెరాలు..
మరిపెడ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారును నూతన్‌కల్ పోలీసుల సహాయంతో ఎర్రపహాడ్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న వారిని స్టేషన్‌కు తరలించారు. వివాహితను ములుగు జిల్లా పస్రా ఠాణాలో అప్పగించారు. కేవలం అరగంట లోపే కేసును చేధించడానికి సీసీ కెమెరాలు దోహదపడ్డాయి.
ఇదీ చూడండి: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న రహదారి విస్తరణ పనులు