Minister mallareddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి అసభ్యకర పదజాలంతో సందేశాలు పంపించడమే కాకుండా రెండుమార్లు నేరుగా ఫోన్ చేసి దుర్భాషలాడిన లారీ డ్రైవర్‌ను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
నేరుగా ఫోన్‌చేసి..
ఎల్బీనగర్ చింతలకుంట ప్రాంతానికి చెందిన లెంకాల వెంకట్‌రెడ్డి(45) లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గతంలో విజయవాడ హనుమాన్ జంక్షన్లో పనిచేసిన అతను గత నెలన్నర రోజులు క్రితం సత్తుపల్లిలో వాసు అనే వ్యక్తి వద్ద లారీ డ్రైవర్‌గా చేరాడు. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఫోన్ నెంబరుకు నిందితుడు అసభ్యకర పదజాలంతో సందేశాలు పంపించాడు. అంతటితో ఆగకుండా మార్చి 30, ఏప్రిల్ 11వ తేదీల్లో నేరుగా మంత్రికి ఫోన్‌చేసి దుర్భాషలాడాడు.
నోటీసులు జారీ..
ఈ విషయమై మంత్రి ఆదేశాల మేరకు ఆయన పీఏ భీమ్నారాయణ గత సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడిని బుధవారం.. అరెస్టు చేసి సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. అనంతరం బెయిల్ ఇచ్చి విడుదల చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. 4మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై వేటు