డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలకు సహకరించడం లేదు. మద్యం మత్తులో బూతుల వర్షం కురిపిస్తున్నారు. సహనం కోల్పోయి దాడులకు సైతం వెనకడుగేయడం లేదు. మరికొందరేమో తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాహనాలను నిలపకుండా వేగంగా ముందుకెళ్లి పోలీసులను ఢీ కొడుతున్నారు. గత నెల 22న జేఎన్‌టీయూ వద్ద ఓ వాహనదారుడు ఎస్సై రాజేశ్వర్‌ను బలంగా ఢీ కొట్టడంతో అతని కాలు విరిగింది. గత నెల 25న జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర మరో ఘటన చోటు చేసుకుంది.
కొందరు పోలీసు అధికారుల తీరుపైనా..
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల పేరిట పోలీసుల వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్ర వివాదాస్పదమవుతోంది. కొందరు సిబ్బంది ప్రవర్తన వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఆ క్రమంలోనే వాహనదారులు సహనం కోల్పోయి వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా శామీర్‌పేట్ ఠాణా రాజీవ్ రహదారి (తూంకుంట)పై ఓ ట్రాఫిక్ ఎస్సై వీరంగం సృష్టించినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండతోనే సదరు ఎస్సై రెచ్చిపోతున్నాడనే విమర్శలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అర్ధరాతి సాధారణంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య రోడ్డు పక్కనే తనిఖీలు నిర్వహించడంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.
హైదర్ నగర్‌లో బీభత్సం
హైదర్‌నగర్‌లో మందుబాబులు బీభత్సం సృష్టించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యత్నించి ముగ్గురిని ఢీ కొట్టారు. శనివారం రాత్రి 11:30 సమయంలో పోలీసులు నిజాంపేట్ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా తప్పించుకునేందుకు సృజన్ అనే వ్యక్తి కారుతో హోంగార్డును, మరో మహిళను ఢీకొట్టాడు. కారులో ఉన్న పవన్ అనే మరో వ్యక్తిని పరీక్షించగా 100 ఎంఎల్ రక్తంలో ఆల్కహాల్ 172 ఎంజీలుగా ఉన్నట్లు తేలింది. కేపీహెచ్‌బీ పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా అస్లాం అనే క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని వేగంగా పోనిచ్చాడు. కారు అదుపు తప్పి వివరాలు సేకరిస్తున్న ఏఎస్సై మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిపాల్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు