Saroornagar Honor Killing News : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఎల్బీనగర్ కోర్టు అనుమతిచ్చింది. ఇద్దరు నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి అంగీకరించింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మోబిన్, మహ్మద్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నేటి నుంచి 16 వరకు ఇద్దరిని ప్రశ్నించి.. హత్యకు దారితీసిన కారణాలను పూర్తిగా తెలుసుకోనున్నారు.
నిందితులిద్దరూ నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఐదుగురిని చూసినట్లు మృతుడి భార్య ఆశ్రిన్ పోలీసులకు వివరించింది. మిగతా ముగ్గురు ఎవరై ఉండొచ్చనే వివరాలను పోలీసులు మోబిన్, మహ్మద్‌లను అడిగి తెలుసుకోనున్నారు. తన తండ్రిని కూడా అన్న మోబిన్ కొట్టి చంపినట్లు ఆశ్రిన్ ఆరోపించింది. తమ్ముడిని సైతం తీవ్రంగా కొడతాడని.. ఎప్పుడూ క్రూరంగా వ్యవహరిస్తాడని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రధాన నిందితుడైన మోబిన్.. గత నేర చరిత్ర గురించి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
ఈ కోణాల్లో ఇద్దరు నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. 5 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత.. ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చి.. ఆ తర్వాత చర్లపల్లి జైలు తరలించనున్నారు.
సంబంధిత కథనాలు..
నాగరాజు హత్య కేసు నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్
మతం మారతానన్న వదల్లేదు.. పరువు హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు!
Abvp Protest: 'సరూర్‌నగర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి'