Ganja Burn: ఏపీలోని విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని దహనం చేశారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తరలిస్తుండగా పట్టుబడిన 2 లక్షల కిలోల గంజాయిని తగలబెట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీజ్ చేసిన రూ.కోట్ల విలువ చేసే ఈ పొడి గంజాయిని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా దహనం చేశారు.
"గంజాయి సరఫరా నియంత్రణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ గంజాయిని ధ్వంసం చేయలేదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుకి మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. గిరిజనుల్లో మార్పు వచ్చింది. గంజాయి సాగు, రవాణా వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దీనికి దూరంగా ఉంటున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం."
- గౌతం సవాంగ్, డీజీపీ
ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించి ఆయా పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ చెప్పారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉంటుందని విశాఖ మీదుగా రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంజాయి సాగు విడిచిపెట్టిన గిరిజనులకు నగదు బహుమతి అందజేశారు.
ఇదీ చదవండి: