Bharatpur gang arrest in wine shop Robbery Case : మద్యం దుకాణం సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడీ చేశారు. అక్కడి నుంచి పరారై ఐదు కిలోమీటర్ల దూరంలో బైకు వదిలి సమీపంలోని ముళ్ల పొదల్లో నిద్రపోయారు. తెల్లారాక ఆటో, లారీల ద్వారా రాష్ట్రం దాటారు. శామీర్‌పేట ఠాణా పరిధిలోని ఉద్దెమర్రి దోపిడీ కేసులో భరత్‌పూర్ ముఠా బరితెగింపు ఇది.
ఈ కేసులో బాలానగర్ సీసీఎస్, ఎస్‌వోటీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి తపంచా, రూ.30 వేలు, రెండు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీసీఎస్ ఏసీపీ శాశంక్‌రెడ్డితో కలిసి మేడ్చల్ డీసీపీ జి.సందీప్ మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.
Uddemarri Robbery Case: రాజస్థాన్ భరత్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ నజీర్(22), షమూన్ (22), ఆరిఫ్‌ఖాన్.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, సిద్ధిపేట జిల్లాలో జేసీపీ డ్రైవర్లుగా పనిచేశారు. అనంతరం సొంతూరు వెళ్లిపోయారు. షమూన్ ఇక్కడే ఉన్నాడు. సొంతూళ్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నజీర్, ఆరిఫ్‌ఖాన్‌లు.. షమూన్‌తో కలిసి చోరీలు చేయాలని పథకం పన్నారు. దోపిడీల కోసం నజీర్ రూ.6 వేలతో రాజస్థాన్‌లో దేశవాళీ తుపాకీ కొన్నాడు. నజీర్, ఆరిఫ్ జనవరిలో స్నేహితుడి వద్దకు వచ్చి, మద్యం దుకాణంలో దోపిడీకి పథకం వేశారు. జనవరి 19న శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో ఓ ద్విచక్ర వాహనం దొంగిలించారు.
కాల్పులు జరిపి.. రూ.2.08 లక్షలు దోపిడీ: అది తరచూ మొరాయించడంతో యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఈ నెల 20న పల్సర్ కొట్టేశారు. పథకం ప్రకారం 23న రాత్రి కాల్పులు జరిపి.. రూ.2.08 లక్షలు దోపిడీ చేశారు. అనంతరం నిందితులు తూముకుంట దగ్గర బైకు వదిలి, రాత్రి అక్కడే పొదల మధ్య నిద్రపోయారు. తెల్లారాక ఆటోలో కొద్ది దూరం వెళ్లి, అనంతరం లారీల్లో రాజస్థాన్‌కు చేరారు.
అల్వాల్‌లో ఉండే స్నేహితుడు మహ్మద్ తారిఫ్ దగ్గర తుపాకీ దాచారు. బాలానగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ జేమ్స్‌బాబు బృందాలు సీసీ కెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ కనుగొని భరత్‌పూర్‌లో ప్రధాన నిందితుడు నజీర్‌ను, అతడిచ్చిన వివరాల ఆధారంగా షమూన్, మహ్మద్ తారీఫ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆరిఫ్ పరారీలో ఉన్నాడు.
ఒక్కడిపై 48 కేసులు: దోపిడీలో ప్రధాన సూత్రధారి నజీర్‌పై గతంలో 48 కేసులుండడం గమనార్హం. శామీర్‌పేట, మూడుచింతలపల్లి ప్రాంతాల్లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడు ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు చేసేవాడు. రాచకొండలో 30, షామీర్‌పేటలో ఐదు, సిద్ధిపేట కమిషనరేట్‌లో 9, రాజస్థాన్‌లో ఇతర కేసులు ఉన్నాయి. 2019- 20 మధ్య ఈ చోరీలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: