Fake Doctor in Jangaon District: ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. పదేళ్లుగా ‘డాక్టర్’గా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడి బాగోతాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం బట్టబయలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా ఉత్తీర్ణత కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న అతను పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లికి వచ్చి ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. ‘ఐఏఎమ్ (ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిసిన్)’ పేరిట బోర్డు పెట్టుకుని.. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్సలు అందిస్తున్నాడు.
ఒకవేళ రోగుల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే కమీషన్ ప్రాతిపదికన వరంగల్‌లోని వివిధ ఆసుపత్రులకు పంపించేవాడు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతనివద్ద తగిన అనుమతి, విద్యార్హత పత్రాలు లేనట్లు గుర్తించారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
పదేళ్లలో అతను 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నరేష్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రావణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధీర్, వైద్యాధికారులు సాంబయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ వైద్యుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.
ఇవీ చూడండి..