పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు.. ఫేస్‌బుక్, వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది. ఒక ఛానల్‌లో ప్రసారమైందంటూ గుర్తుతెలియని వ్యక్తులు దానిని వాట్సాప్ బృందాలకు పంపించారు. అది నిమిషాల్లో వేలమందికి చేరింది. సినీ ప్రముఖులు, పత్రికా విలేకరులు ఆరా తీస్తే తాను బతికే ఉన్నానని ఆమె స్వయంగా ప్రకటించారు.
ఆ చిత్రం చూస్తే అచ్చం టీవీలో వచ్చినట్లే ఉంటుంది. అందులోని విషయం అందరూ నమ్మేలా ఉంటుంది. అది ప్రముఖుల మరణ వార్త కావొచ్చు. ప్రమాద సమాచారం కావొచ్చు. అది కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరికొందరిని అయోమయంలోకి నెట్టేస్తుంది. వ్యక్తులపైనే కాదు సంస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అది నిజమేనా అని నిర్ధారించుకునేలోగానే అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వార్తలు(Fake News) క్రమంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మొబైల్ యాప్స్ సహాయంతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి బోగస్ వార్తలు(Fake News) సృష్టించి జనంలోకి వదులుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఇలాంటివారిని 10 నెలల్లో 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్తనూ వెంటనే నమ్మవద్దని, విశ్వసనీయ వార్తా సంస్థల వెబ్‌సైట్లను, ఛానళ్లను పరిశీలించి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా తెలుస్తుంది..
ఏదైనా వార్త, వీడియో నకిలీద(Fake News)ని, అసత్యమైంద(Fake News)ని అనుమానం వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల పరిశోధన, అభివృద్ధి విభాగం వెంటనే ఫ్యాక్ట్‌చెక్ పేరుతో ఆ వార్త, వీడియో నకిలీదని, దాని మూలం ఫలానాచోట ఉందని వివరిస్తుంది.
గూగుల్: వార్తలు, వీడియోలు, కార్టూన్లు, ఫొటోలను రివర్స్ ఇమేజ్, సెర్చింగ్ ద్వారా క్షణాల్లో ఆయా వార్తలు, వీడియోలు, ఫొటోల వివరాలను తెలుపుతుంది. అభ్యంతరాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటుంది.
ట్విటర్: వివాదాస్పద ప్రకటనలు, మాటలు, చేష్టలు, వీడియోలను ఎవరైనా పోస్ట్ చేస్తే చాలా సందర్భాల్లో ట్విటర్ ప్రతినిధులు స్వయంగా తొలగించడంతో పాటు ఆ హ్యాండిల్‌పై నిషేధం విధిస్తున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్: బాధితులు, వ్యక్తులు, పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే తొలగిస్తున్నాయి.
యూట్యూబ్: తాను అనుమతించిన కొన్ని ఛానళ్లలో అసభ్య కథనాలు, ఫొటోలు, రాజకీయ వార్తల వీడియోలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వెంటనే తొలగించడంతోపాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఎవరు అప్‌లోడ్ చేశారన్న సమాచారాన్ని ఇస్తోంది.
స్వయంగా వీక్షిస్తున్న సైబర్‌క్రైమ్ పోలీసులు
నెటిజన్ల నుంచి అందుతున్న సమాచారం, సామాజిక మాధ్యమాలను స్వయంగా వీక్షించడం ద్వారా పోలీసులు అసత్య వార్తలు, కథనాల రూపకర్తలను పట్టుకుంటున్నారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలు, కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని సంయుక్త కమిషనర్ (నేర పరిశోధన) అవినాష్ మహంతి వివరించారు. ప్రచారంతో పరువుకు భంగం కలిగిన వారు 9490616555 నంబరుకు వాట్సప్ చేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
మొబైల్ యాప్‌ల మాయాజాలం
అసత్య కథనాలు, వార్తలను సైబర్ నేరగాళ్లు కొన్ని మొబైల్ యాప్‌లతో సృష్టిస్తున్నారు. టీవీ ఛానళ్లలో వచ్చే వార్తలను ఫొటోలు తీసి, వివాదాస్పదంగా మార్చి ప్రచారం చేస్తున్నారు.
జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేయనందుకు నిరసనగా సునీత అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ వాట్సప్‌లో కథనాలొచ్చాయి. ట్విటర్‌లో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డికి ట్యాగ్ చేసినట్టూ ఉంది. సునీత అంటూ పోస్ట్ చేసిన ఫొటో మరో యువతిది. ఆమె ఇంజినీరింగ్ చదవలేదని తేలింది.
అసత్య వార్తలు, కథనాలను రూపొందిస్తున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో అసత్య వార్తలు, కథనాలు 70 శాతం ఉన్నాయని అక్కడి సైబర్ భద్రత విభాగం అధికారులు గుర్తించారు.