Kuwait Murders Case : కువైట్‌లో జరిగిన మూడు హత్యలకు తన భర్త వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. కువైట్ నుంచి స్వస్థలానికి వచ్చిన వెంకటేశ్ భార్య స్వాతి అన్నారు. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని తన భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు.

Triple Murders in Kuwait : 'కువైట్‌లో షెఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్‌పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం' అని స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు.
Kuwait Murders Case Updates : తన భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని.. అతను ఎలాంటి నేరాలు చేయలేదని జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని స్వాతి చెప్పారు. తన భర్తను ఎలాగైనా కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె వేడుకున్నారు. కాగా.. కువైట్‌లో జరిగిన హత్య ఘటనపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆరా తీస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.