Theft in Minister Tour: రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. సందడి అదనుగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ బిజీగా ఉన్న సమావేశంలో తమ పనిని సైలెంట్‌గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా పూడూరులో జరిగింది.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో మంత్రికి స్వాగత కార్యక్రమంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులకు స్వాగతం పలకడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. నాయకులంతా చేరుకోగానే స్థానికులు ఉత్సాహంగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. జేజేలు పలికే లోగా చోరులు తమ చోరకళకు పని చెప్పారు. స్థానిక నాయకులు, పాత్రికేయుల జేబుల్లోంచి ఎనభై వేలు తస్కరించి జారుకున్నారు. అందరూ వెళ్లాక జేబులు తడుముకుని నాయకులతో పాటు పాత్రికేయులు విస్తుపోయారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యథేచ్ఛగా..
మంత్రి పర్యటనలో భాగంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చాలా మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతమంది ఉన్నా... జేబు దొంగలు యథేచ్చగా తమ చేతివాటం ప్రదర్శించటం గమనార్హం.
ఇదీ చదవండి: