PDS Rice illegal transport in Nizamabad: ప్రభుత్వం నిరుపేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోంది. ఇక్కడి నుంచి బియ్యం మహారాష్ట్రతో పాటుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నారు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని దుండగులు తరలిస్తున్నారు. వారిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు సిబ్బంది కళ్లలో కారం కొట్టారు. అనంతరం బారికేడ్లను ఢీకొట్టి వారి నుంచి తప్పుంచుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Nizamabad PDS Rice Transport case : నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్న డీసీఎం వ్యానులో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటేశ్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఆర్మూర్, కమ్మర్పల్లి, బాల్కొండ ప్రాంతంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఛేజింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న వ్యక్తులు పోలీసులపై కారంపొడి చల్లి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
వ్యాన్ డ్రైవర్ తన యజమాని సాజిద్‌కు సమాచారం అందించాడు. సాజిద్ తన స్విఫ్ట్ కారులో వ్యాన్ వైపు వెళ్లి, వ్యాన్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు. పరిమితికి మించిన వేగంతో రెండు టోల్ ప్లాజాల గేట్లను ఢీ కొట్టి దుండగులు బియ్యాన్ని తరలిస్తున్నారు. అయినా పట్టువదలని టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాన్ని ఛేజ్ చేస్తూ వెళ్లారు. దీంతో దుండుగలు భయపడి వ్యాన్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. పట్టుబడిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి అందులో ఉన్న 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో వ్యానులో డ్రైవర్, క్లీనరుతో పాటుగా,స్విఫ్ట్ కారుతో వచ్చిన సాజిద్, మరో వ్యక్తి (మొత్తం నలుగురు)పై అటెంప్ట్ మర్డర్, 353 ఐపిసి సెక్షన్లతో పాటు మరి కొన్ని సెక్షనులు కింద టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.