Girl Suspect Death in Jeedimetla: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో బాలిక అనుమానాస్పద మృతికి వ్యతిరేకంగా షాపూర్ నగర్ ప్రధాన రహదారిపై ఆందోళనలు, రాస్తారోకోలతో ఉద్రిక్తత నెలకొంది. బాలికపై హత్యాచారం జరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపించడంతో.. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి ప్రతిపక్షాల నాయకులు సైతం మద్దతు తెలిపారు. ఘటనకు వ్యతిరేకంగా ఆ పరిసరాల్లో ఉన్న దుకాణాలను మూసేశారు.
దిల్లీ నేత పరామర్శ
బాలిక మృతి ఘటనపై భాజపా దిల్లీ నేత మంజీందర్ సింగ్ స్పందించారు. బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన ఆయన.. చిన్నారిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని.. అరెస్టు చేయకపోతే హైదరాబాద్ వచ్చి రాస్తారోకో చేస్తామని స్పష్టం చేశారు. బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.
విపక్షాల మద్దతు
బాధితులకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. ఘటనాస్థలాన్ని రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. కాగా ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ హత్యా, ఆత్మహత్యా అనేది చెప్పలేమని పోలీసులు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాల రాజు పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే
సుభాష్‌నగర్‌కు చెందిన బాలిక.. మంగళవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి అదృశ్యమవగా.. జీడిమెట్ల పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాలిక మృతుహదేహం లభ్యమైంది. స్థానిక పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగులో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దోషులను తప్పిస్తున్నారని.. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించి నిరసనలు తెలిపారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చొరవతో ఆందోళన విరమించారు. నిందితులను త్వరగా పట్టుకోకపోతే మరోసారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Accused Arrest in Minor Rape Case : బాలికతో వ్యభిచారం కేసు.. మరో 11మంది అరెస్టు