హైదరాబాద్‌లోని పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఐదేళ్ల బాలిక కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో హత్యగా తేల్చిన పోలీసులు అన్ని వైపులనుంచి దర్యాప్తు చేపట్టారు. ద్వారకాపురి కాలనీ సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ బాలికను ఎత్తుకుని ఆటో ఎక్కి ద్వారకాపురి కాలనీ సమీపంలో దిగిందని డ్రైవర్ పేర్కొన్నాడు.
బాలిక చనిపోయినట్లు తనకు తెలియదని.. నిద్రపోయిందని భావించినట్లు ఆటో డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసిన మహిళ ఆ తర్వాత మెహదీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. మహిళ అక్కడి నుంచి ఎటువైపు వెళ్లిందనే వివరాలను సేకరిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకోవడానికి బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: Panjagutta Girl Murder Case: పంజాగుట్ట బాలికది హత్యే.. కడుపులో తన్నడం వల్లే మృతి