జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు అందించే కొవిడ్ టీకాలను అమ్ముకున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కలెక్టర్ రవి సస్పెండ్(suspend) చేశారు. ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కుత్తల శేఖర్, నాగరాజు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్ కాగా మరొకరు ఫార్మసిస్ట్. ఈ ఇద్దరు కొవిడ్ వ్యాక్సిన్(corona vaccine) కొన్ని సీసాలు దొంగిలించి అవసరమైన వారికి మధ్యాహ్న సమయంలో ఆస్పత్రికి పిలిపించి టీకా వేసేవారు. ప్రతిరోజు ఒక్కరు లేదా ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చేవారు. ఒక్కొక్కరి వద్ద 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
సుమారు 12 మందికి ఇలా వ్యాక్సిన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య డబ్బులు పంపిణీలో తేడాలు రావటంతో అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న వైద్య అధికారులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: kaleshwaram: ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం.. సొరంగ ప్రతిపాదనపై అసహనం