తన భూమిని బంధువులు అన్యాయంగా లాక్కున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్పీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన బోయ సతీశ్ వ్యవసాయ భూమిని అతని మేనమామ ఆక్రమించాడని బాధితుడు ఆరోపించాడు. అన్యాయంగా 31 గుంటల భూమిని ఆక్రమించారని వీడియోలో వాపోయాడు.
సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే స్పందించిన అతని మిత్రులు పోలీసుల సాయంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మేనమామే కారణం...
గ్రామంలో అతనికున్న ఐదెకరాల భూమిని మేనమామ అయిన కిలారు నాగేశ్వరరావుకు కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు. కిలారు నాగేశ్వరరావుకు ఉన్న మూడెకరాల 20 గుంటల పొలాన్ని నాలుగు ఎకరాల 9 గుంటలుగా మార్చుకున్నాడని బాధితుడు ఆరోపించారు. తన భూమిపై కన్నేసిన మేనమామ అన్యాయంగా తన 31 గుంటల భూమిని కబ్జా చేసి రికార్డులో మార్చాడని.. దీనికి గ్రామ పెద్ద అప్పయ్య సహకరించాడని సతీశ్ సెల్ఫీ వీడియోలో వాపోయారు.
ప్రస్తుతం బోయ సతీశ్ మహబూబాబాదులోని ఓ పొల్యూషన్ నమోదు చేసే వాహనంలో పని చేస్తున్నారు. అతనికున్న ఐదెకరాల భూమిని, మేనమామ భూమిని పెద్దల సమక్షంలో కొలవగా... అతనికి కేవలం నాలుగు ఎకరాల 9 గుంటలు మాత్రమే వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కిలారు నాగేశ్వరరావుకు 3 ఎకరాల 20 గుంటలు ఉండాల్సిన భూమి 4 ఎకరాల 7 గుంటలుగా వచ్చిందని వీడియోలో వివరించారు.
దౌర్జన్యానికి పాల్పడ్డారు...
దీనిపై అతను మేనమామ నాగేశ్వరరావును, అతని కుమారుడు రాజేశ్‌ను నిలదీయగా తనను దుర్భాషలాడుతూ.. దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితుడు వాపోయారు. వీరికి గ్రామ పెద్ద అప్పయ్య సహకారంతోనే తన భూమిని అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. తన చావుకు కారణం మేనమామ కిలారు నాగేశ్వరరావు, అతని కుమారుడు రాజేశ్, గ్రామ పెద్దయ్య అప్పయ్యనేనని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసిన అతని మిత్రులు కారేపల్లి పోలీసుల సహాయంతో మహబూబాబాద్‌లోని నిర్మానుష్య ప్రదేశాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.