మద్యం సేవించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా మృతి చెందాడు. సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని దుర్గా వైన్స్ వద్ద ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓల్డ్ ఆల్వాల్ హరిజన బస్తీకి చెందిన కుండలు అనే వ్యక్తి మద్యం సేవిస్తూ వైన్ షాపు వద్దే మరణించాడు.
ఇంటికి వెళ్తూ మద్యం సేవించేందుకు..
నగరంలోని ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన కుండలు... కూలీ పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మద్యం తాగేందుకు దుర్గా వైన్స్ షాపు వద్దకు చేరుకున్నాడు. పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల ఆరా
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న మృతుడి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.