రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రహదారులు రక్తిసిక్తమయ్యాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో... ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా, నారాయణపేట జిల్లా ఎన్నోన్‌పల్లి వద్ద.. కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులంతా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎస్బీఐ సమీప జాతీయ రహదారి పక్కన బస్సు నిలిపి ఉంది. అయితే బాచుపల్లికి చెందిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు గోవా టూర్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న బస్సు వెనుక భాగంలో తమ కారుతో బలంగా ఢీకొట్టారు. దీంతో జయసాయి అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మదినగూడలోని శ్రీకర్ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జయసాయి మృతదేహాం కార్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు చాలా సేపు ప్రయత్నించి బయటికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: