హైదరాబాద్ హైదర్‌గూడ అవంతి నగర్‌లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదంతో ఒకరు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న బద్రీనాథ్, గౌరీనాథ్తో పాటు ఆయన భార్య పిల్లలు తేరుకునే లోపు ఇళ్లంతా పొగలు కమ్ముకున్నాయి. మంటలు మూడంతస్తులకు పాకాయి. అందరూ ప్రాణాలు కాపాడుకునేందుకు 3వ అంతస్తులోకి వెళ్లారు.
చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను కాపాడారు. అప్పటికే ఊపిరాడక గౌరీనాథ్ అపస్మారక స్థితిలో చేరుకుని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందారు. గౌరీనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు ఆయన సోదరుడు బద్రీనాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాద తీవ్రతకు ఇంట్లోని వస్తవులు, పరికరాలు కాలి బూడిదైపోయాయి.
వ్యాపారి, సేవా కార్యక్రమాలు నిర్వహించే శాంతారామ్ కుటుంబం అవంతి నగర్‌లో నివాసం ఉంటోంది. ఈయనకు ముగ్గురు కుమారులు. ఆదివారం ఉదయం శాంతారామ్ దంపతులు, చిన్న కుమారుడు త్రినాథ్ కుటుంబంతో కలిసి వికారాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లారు. బద్రీనాథ్ భార్య పిల్లలు మూడు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లారు. బద్రీనాథ్‌తో పాటు గౌరీనాథ్ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కు రావాలని పిలిచినా ఒక రోజు ఆగి వస్తామని చెప్పారు. తల్లిదండ్రులతో కలిసి వీళ్లు కూడా వికారాబాద్ వెళ్లి ఉంటే ప్రమాదం నుంచి బయటపడే వారని కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు. అగ్నిప్రమాదంలో వివరాలు సేకరించిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దందా.. రూ.23 లక్షల బిల్