అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెద్దకొట్టాలపల్లిలో ఒకే రోజు వ్యవధిలో నానమ్మ, మనువడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకేసారి ఇద్దరి అకాల మరణంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. ఇంటిి పెద్దావిడ పోయిందనే శోకంలో ఉన్న ఆ కుటుంబానికి చేతికొచ్చిన కుమారుడు కూడా చనిపోయాడన్న వార్తతో.. ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉరవకొండ పెద్ద కొట్టాల పల్లికి చెందిన యల్లమ్మ(80) శనివారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుర్చీలు, షామియానాను విడపనకల్లు నుంచి తెచ్చేందుకు మనువడు వంశీ (19) ఆటోలో బయలుదేరాడు. మాళాపురం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీ ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి: కేఏ పాల్
3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం